ఆంధ్రులు ఆరంభ శూరులు అంటారు. అలాగే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న వేలం వెర్రి ధోరణిని ఎలా వర్ణించాలో తెలియట్లేదు. గత ఐదారు ఏళ్ళల్లో నల్ల ధనం కొకల్లలుగా పెరిగింది, దానికి కారణలు ఏవైనా కావచ్చు. ఆ నల్ల ధనాన్ని పెట్టుబడి పెట్టే మార్గాలు చాలా తక్కువ ఉన్నట్టు ఉన్నాయి.
పూర్వపు రోజుల్లో పెద్దలు సంపాదించిన ఆస్తులు కరగదియ్యటానికి భూస్వాములు మద్రాసు వెళ్లి సినిమాలు నిర్మించే వాళ్ళు. రోజులు మారాయి, 20 ఏళ్ళ క్రితం ఊహించలేనన్ని వ్యాపారాలు, పరిశ్రమలు ఇప్పుడు ఉన్నాయి. కాని ధనికులు, నల్ల ధనం మెండుగా ఉన్నవాళ్లు కేవలం ఇంజినీరింగ్ కళాశాలలు, న్యూస్ చానల్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీదే మక్కువ చూపిస్తున్నారు!
నేడు రాష్ట్రం లో 656 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కొత్తగా అనుమతి ఇచ్చిన వాటితో కలిపి 700 కి చేరుకోనుంది. మొత్తం సీట్ల సంఖ్య రెండున్నర లక్షలు. వీటిలో ఎంత మంది నిజమైన ఇంజినీర్లుగా తయారు అవుతారు అనేది ఆలోచించాలి. అసలు ఇన్ని కళాశాలలు లో అధ్యాపకులు ఎక్కడ నుంచి వస్తున్నారు, వాళ్ళ కున్న అర్హతలు ఏంటి అనేది AICTE వాళ్ళకి పడుతున్నట్టుగా లేదు. సెక్యూరిటీ డిపాజిట్ తీస్కుని అనుమతులిచేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే కొత్త కళాశాలలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం వారిస్తుంది. కాని AICTE ఇస్తూపోతుంది.
దేశం మొత్తం లో 3200 కళాశాలలు ఉండగా 700 మన రాష్ట్రం లోనే ఉన్నాయి. ఈ కళాశాలలు అన్ని దివాలా తీయకుండా ఉండాలంటే ఈ సీట్లు అన్ని నిండాలి. అందుకే ఎంసెట్ పరీక్షలో సున్నా మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు ఉన్నాయి. (ఈ సున్నా మార్కులకి సీట్ కధ విని మన గవర్నర్ నరసింహన్ గారు నిశ్రేష్టులు అయ్యారు). అంత దిగాజారినా అన్ని సీట్లు నిండట్లేదు.
ఈ కళాశాలలు నుంచి పట్టభద్రులు అవుతున్న వాళ్ళల్లో ఎంత మంది ఉద్యోగానికి పనికొస్తారు అన్నది ప్రస్నార్ధకమే. అందుకే విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కొత్త ఉద్యోగులని ట్రైనింగ్ కి పంపిస్తుంది. కొంత మంది పట్టభధ్రులకి అసలు ఉధ్యొగార్హతలు లేవని ఈ కంపెనీలు తేల్చి చెప్తున్నాయి. వీటి వలన ఇంజినీరింగ్ పట్టా విలువ తగ్గిపోతుంది. స్తాపించిన ప్రతి కళాశాలలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రతి రిజర్వేషన్ విద్యార్ధి ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి. కాని వీళ్ళల్లో ఎంత మంది నాలుగేళ్ళల్లో పట్టభద్రులు అవుతున్నారు అనే ప్రశ్నకు జవాబు లేదు. ఈ విద్యార్థులు ఎన్నాళ్ళు చదివితే కళాశాలలకు అంత లాభం. కొన్ని కళాశాలలు ఈ ఫీజులు, nri కోటా సీట్లు వేలం తొనే నేట్తుకొస్తున్నాయి.
నేడు ఆంధ్ర దేశం లో 13 న్యూస్ చానల్స్ ఉన్నాయి. 50 కోట్లు ఉంటే ఎవరైనా కొత్త ఛానల్ ప్రారంభించవచ్చు. కాని వాటిలో ప్రసారం చేస్తున్నవి అయితే వార్తలు కావు. పుకార్లు, పక్షపాత కబుర్లు, చర్చల పేరుతో ఏ మాత్రం అర్హత లేని వాళ్ళ మధ్య అరుపులు కేకలు. వీటి వలన ప్రజలకి వార్తల మీద ఉన్న నమ్మకం పోతుంది/పోయింది. tv9 బెదిరింపులు, అక్రమాలు అందరికి తెల్సినవే. ysr మరణం వెనుక అంబానీల హస్తం ఉందని రెండు చానల్స్ ప్రసారం చేసిన పుకార్లు విని ఆయన 'అభిమానులు' రేలైన్సు షాపులని, పనిలో పనిగా పోలీసు వాహనాలని ద్వంసం చేసారు. ఇక స్వామిజీల లీలలు అనే పేరుతో ఆ స్వామిజీల శృంగార కార్యకలాపాలను విచ్చల విడిగా ప్రసారం చేస్తూనే ఉంటారు.
ఇక వీటన్నిటికన్నా ముందు మొగ్గ తొడిగిన వ్యాపారం రియల్ ఎస్టేట్. 2005 -07 కాలం లో భాగ్యనగరం లో ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకళ్ళు రియల్ ఎస్టేట్ కొనడం అమ్మడం లోనే ఉన్నారు అనేది అతిశయోక్తి కాకపోవచ్చు. చాల మంది యువకులు, వ్యాపారులు వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసి రియల్ ఎస్టేట్ దళారులుగా మారారు. స్థలాల ధరలు 3 ,4 వారాల్లో రెండింతలు అయ్యేవి. కోటానుకోట్లు పెట్టుబడులు ప్రవాస భారతీయుల నుంచి వచ్చాయి. బహుళ జాతి సంస్థలు వచ్చాయి. వారి వెంటే ఆక్రమణదారులు, రాజకీయనేతలు వచ్చారు. 2007 లో మాంద్యం మొదలు ధరల పెరుగుదల నిలిచిపోయింది. అప్పటి నుంచి క్రయ విక్రయాలు ఆగిపోయాయి. వేల కోట్లు రూపాయులు ఇలా ఈ స్థలాలు, భవనాల రూపంలో ఆగిపోయాయి. చిన్న చిన్న వ్యాపారులు ఎప్పుడో దివాలా తీసారు. ఒకరికి లాభం వచ్చిందని వంద మంది ఈ వ్యాపారం లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు.
గుడ్డిలో మెల్ల లాగ పైన చెప్పిన మూడు అంశాల్లో సంతోషించదగ్గ విశేషం ఏమిటంటే, ఈ మూడు రంగాలు చాల మంది నిరుద్యోగులకి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. కాని ఈ మూడు రంగాల్లో ఎన్ని సంస్థలు లాభసాటిగా ఉంటాయి, అసలు ఎన్ని నిలదొక్కుకుంటాయి అన్నది కాలమే చెప్తుంది.
మన రాష్ట్ర ప్రజలు ఈ వేలం వెర్రి ధోరణిని ఎంత త్వరగా వీడితే అంత మంచిది.
Friday, August 6, 2010
Subscribe to:
Posts (Atom)